భీమ‌దేవ‌ర‌ప‌ల్లి తెలంగాణ‌లోని ఓ సాధారణ పల్లె... ఆ పల్లెలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఆ పల్లెలో ఉన్న జంపన్న అనే వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అన్నది కథ.

భీమ‌దేవ‌ర‌ప‌ల్లి తెలంగాణ‌లోని ఓ సాధారణ పల్లె... 
ఆ పల్లెలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఆ పల్లెలో ఉన్న జంపన్న అనే వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అన్నది కథ. 

సినిమా చాలా బాగుంది. మీరు పల్లెటూరి వాళ్ల  అయితే మీకు మీ పల్లె గుర్తుకువస్తుంది. అంతేకాదు సినిమా చూస్తున్నంత సేపు ఆ పల్లెలో ఉన్న‌ట్టే అనిపిస్తుంది. పల్లెటూర్లో ఉండే కుల వృత్తుల ప్రజల జీవన విధానం, వారి ప్రవర్తన విష‌యాల‌ను దర్శకుడు  క‌ళ్ల ముందు ఉంచాడు.  మాటలు చాలా బాగున్నాయి. ('నువ్వు నా నింగిలో పూసిన సింగిడి పువ్వు' అని తనని ఇష్టపడుతున్న అమ్మాయితో ఒకరు 
చెప్పే మాట) అలాగే మాటల చాటున విసిరిన సామెతలు కూడా.  

సినిమా లో ప్రధానమైన జంపన్న పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర చేసిన అంజి వల్గుమాన్ చాలా బాగా నటించాడు. తన జీవితంలో మార్పు తెచ్చే సంఘటన కు ముందు తర్వాత తన నటనలో స్పష్టమైన మార్పు చూపాడు.  అలాగే తన భార్య గా చేసిన సాయి ప్రసన్న చాలా బాగా నటించింది. అలాగే బలగం లో ప్రధాన పాత్ర చేసిన సుధాకర్ రెడ్డి కూడా ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాడు. 

రచయిత తన మాటలతో రాజకీయనాయకులు ప్రకటిస్తున్న ఉచిత పథకాల మీద తన మాటల తో వ్యంగ్యాస్తాలను సంధించాడు. పౌర హక్కుల నేతలనూ వదలలేదు. ప్రజలకు ప్రభుత్వాలు పని కల్పించాలి కానీ ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు అనీ, ఉచితాలు అసలు ఏవీ ఉచితాలు కావు, అవి మరో రూపంలో ప్రజలపై భారం అని దర్శకుడు చెప్తాడు. సినిమా మొదటి భాగం పల్లెలో ఉన్న పాత్రల నేపథ్యం, వారి ప్రవర్తన ద్వారా సున్నితమైన హాస్యం పండించిన దర్శకుడు విరామం దగ్గర కథను ఇంకో మలుపు తిప్పుతాడు. సినిమా ముగింపు దశకు వచ్చేసరికి మనకు కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాడు దర్శకుడు.  

ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచీ (కొంతమంది కొత్త వాళ్ళయినప్పటికీ) దర్శకుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. దర్శకుడి పనితనం బాగుంది. చరణ్ అర్జున్ సంగీతం చాలా బాగుంది. పాటలు బావున్నాయి. పాటల్లో కూడా పదాలు చాలా బావున్నాయి. పాటల్లో బంగారు తాడుతో గొంతుకురి పోసినట్టాయే , ఊబిగుంటేనే ఊటబావి అని మోసపాయే ఊరు లాంటి పోలికలు ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం సాధారణంగా ఉంది. కూర్పు మరింత బావుండాల్సింది. సినిమాలో ఎప్పుడైతే టి.వి. ఛానల్ లో ఉచితాల గురించి చర్చ మొదలైయిందో  అయ్యిందో అప్పటి వరకూ సినిమాగా నడుస్తున్నది కాస్తా డాక్యుమెంటరీ గా మారిపోయింది. అందువల్ల నాటకీయత లోపించి ఆ సన్నివేశం ఆకట్టుకోదు. కానీ అదే సినిమా నటుల్ని పెట్టి ఉంటే బహుశా ఆ నాటకీయత వచ్చి ఆ సన్నివేశం మరింతగా ఆకట్టుకునేదేమో.  

సినిమా బాగున్నా ప్రజల్లో కి అంత బలంగా వెళ్లకపోవడానికి కారణం ప్రచార లోపమే కారణం అనుకోవచ్చు. లేదంటే ఈ సినిమా కూడా 'బలగం' లాగా ప్రజలను విశేషంగా ఆకట్టుకునేది. ఈ సినిమా  థియేటర్ లో చూసి ఉంటే మరింత బావుండేది అనిపిస్తుంది. 

ఎంత జరిగినా ప్రజలు మారరు అని చివరి సన్నివేశం లో దర్శకుడు చూపిస్తాడు. నిజమే ప్రజలు మారరు ... దాన్ని వారి అత్యాశ అనడం కంటే కూడా వారి దరిద్రం మాటున దాగిన ఆశ వారిచేత మళ్లీ  మళ్లీ  మోసపోయేలా చేయిస్తుంది అని అనుకోవచ్చు.  

‘భీమ‌దేవ‌ర‌ప‌ల్లి బ్రాంచి’ అందరూ చూడాల్సిన సినిమా. 

అమెజాన్ ప్రైమ్ లో ఉంది.
విశ్వనాథ్ (డైరెక్షన్ డిపార్ట్మెంట్)

Post a Comment

0 Comments